హుజూరాబాద్‌లో కురుక్షేత్ర యుద్ధం

హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికల సంగ్రామం కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలా ఉంటుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే ఈ సంగ్రామంలో తప్పకుండా ధర్మానిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కమలాపూర్‌లోని తన నివాసంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 20 ఏళ్లపాటు ఉద్యమ జెండా ఎత్తి భంగపడి, అవమానాలకు గురైనవారు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు హుజూరాబాద్‌లో జరిగే కురుక్షేత్రానికి తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి తొత్తులుగా, బానిసలుగా మారారని, తనపై అవాకులు, చెవాకులు పేలిస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. 

అధిష్ఠానం ఇచ్చిన రాతలను పట్టుకొని తనపై నిందలు వేసి, ప్రజలను అవమానపరిస్తే రాజకీయంగా బొందపెడుతారని అన్నారు. ఆత్మగౌరవ పోరాటానికి, అణగారిన ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడాని, అణిచివేత నుంచి ప్రజలను ముందుకు నడపడానికి హుజూరాబాదే గొప్ప ఉద్యమం క్షేత్రంగా ఉంటుందని, మరో ఉద్యమానికి నాంది పలుకుతుందని చెప్పారు. ఎప్పటికైనా తానే నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు అక్రమంగా డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, నాయకులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. డబ్బులతో కొంతమంది నాయకులను కొనుగోలు చేస్తారేమో గానీ, ప్రజలను కొనుగోలు చేయలేరని ఆయన అన్నారు.