ఏడేళ్ల తర్వాత జరిగే ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం: మిథాలీ రాజ్

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత భారత మహిళల జట్టు ఈ నెలలో ఓ టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. ఇంగ్లండ్‌తో జూన్ 16 నుంచి మొదలయ్యే ఆ నాలుగు రోజుల మ్యాచ్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నానమని భారత కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో బీసీసీఐ బుధవారం ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్.. ఇంగ్లీష్ జట్టుతో ఆడబోయే టెస్ట్‌కు సంబంధించి అడిగిన ప్రశ్నకు మిథాలీ బదులు చెప్పింది.

‘2014లో చివరిగా ఇంగ్లండ్‌లో ఓ టెస్ట్ మ్యాచ్ ఆడాం. నాతో పాటు ఆ మ్యాచ్‌లో ఆడిన వారందరికీ టెస్ట్ ఫార్మాట్ నుంచి చాలా గ్యాప్ వచ్చింది. పైగా, ఈసారి మా టీమ్‌లో చాలా మంది కొత్త వాళ్లు ఉన్నారు. టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు నేను కూడా చాలా ఆతృతగా ఉన్నా.. అలాగే కెరీర్‌లో తొలి టెస్ట్ ఆడబోతున్న చాలా మంది ప్లేయర్లున్న టీమ్‌ను నడిపించనున్నందుకు చాలా ఆనందంగా ఫీలవుతున్నా. నిజంగా ఇదో కొత్త అనుభవం. క్రికెట్‌లోనే టెస్ట్ ఫార్మాట్ ప్రత్యేకమైనది. ఇంగ్లండ్‌లో మ్యాచ్ కోసం నాతోపాటు మా టీమ్ అంతా ఎదురు చూస్తోంది.’అని మిథాలీ చెప్పింది.

కాగా, ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడనుండటంపై సీనియర్ ప్లేయర్ జులన్ గోస్వామి కూడా సంతోషం వ్యక్తం చేసింది. ‘ఏడేళ్ల తర్వాత మళ్లీ.. మేము ఓ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాం. మనదేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు జట్టుకు ఉపయోగపడే విధంగా మరింత బాధ్యతగా ఆడాలి. ఇక బౌలర్‌గా టెస్ట్ మ్యాచ్‌లో లాంగ్ స్పెల్స్ వేయాల్సి ఉంటుంది’అని జులన్ చెప్పుకొచ్చింది.

ఇక బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత భారత పురుషుల, మహిళల జట్లు ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌కు బయల్దేరాయి. అక్కడ మహిళల జట్టు ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.

Comments are closed.