అప్పుడు `బ్లడీ ఇండియన్స్` అన్నారు.. ఇప్పుడు మన బూట్లు నాకుతున్నారు: ఫరూక్ ఇంజినీర్

జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్ ఓలీ రాబిన్సన్ కఠిన శిక్ష ఎదుర్కోవాల్సిందేనని, అతడికి ఎవరూ మద్దతివ్వకూడదని భారత మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ అన్నాడు. అవి యుక్త వయసులో చేసిన ట్వీట్లంటూ రాబిన్సన్‌ను ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెనకేసుకురావడం తప్పని అన్నాడు. యుక్త వయసులో ఉన్నప్పుడు ఎలాంటి తప్పైనా చెయ్యొచ్చని సూచించేలా ప్రధాని మాటలు ఉన్నాయని విమర్శించాడు. ఆసియా క్రికెటర్లు, ముఖ్యంగా భారత క్రికెటర్ల పట్ల ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్ల ప్రవర్తనను ఫరూక్ ప్రస్తావించాడు.

`తొలిసారి కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లినపుడు ఒకటి, రెండు సార్లు జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నా. నా గురించి మెల్లగా మాట్లాడుకునేవారు. నా యాసను ఎగతాళి చేసేవారు. నిజానికి నా ఇంగ్లీష్ చాలా మంది ఆంగ్లేయుల కంటే బాగుంటుంది. ఇక, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ `బ్లడీ ఇండియన్స్` అన్నాడు. అతడొక్కడే కాదు.. మిగతా ఆంగ్లేయుల ఆలోచనా అలాంటిదే. కాకపోతే వారు పైకి అనరు. 

భారతీయుల పట్ల ఆస్ట్రేలియన్లు కూడా అలాగే ప్రవర్తించేవారు. ఎప్పుడైతే ఐపీఎల్ వచ్చిందో వారి స్వరాలు మారాయి. కేవలం డబ్బు కోసం మన బూట్లు నాకుతున్నారు. కొన్ని నెలలు గడిపేందుకు, భారీగా డబ్బు ఆర్జించేందుకు వారికి భారత్ గొప్ప దేశంగా మారిపోయింది. అయితే వారి అసలు రంగేంటో నా లాంటి పాత తరం క్రికెటర్లకు తెలుసు. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందే. జీవితాంతం నిషేధించాలని నేను అనను. కానీ, అలాంటి ఆలోచన కలిగి ఉండడం తప్పని తెలిసేలా వారు శిక్ష అనుభవించాల`ని ఫరూక్ అన్నారు.

Comments are closed.