ఐసోలేషన్ సెంటర్ గా స్మశానం … హాయిగా ఉందంటున్న గిరిజనులు !

గిరిజన సాంప్రదాయాలు కొంచెం విభిన్నంగా ఉంటాయి. దీనితో వారి జీవన విధానం కూడా ఒకరకమైన విశేషాలను కలిగి ఉంటుంది. వారు చేసే పని నుండి తినే తిండి వరకు అన్ని కూడా విభిన్నమే. అయితే ఈ ప్రత్యేకతను కరోనా మహమ్మారి బారినుండి రక్షించుకోవడంలో కూడా చూపారు. కరోనా సోకడంతో అందరు ఐసోలేషన్ సెంటర్ల కోసం పరుగులు పెడుతున్నారు. పట్టణాల్లో వారు ప్రత్యేక ఇళ్లలోకి మారుతుండగా ఉన్నతవర్గాల వారు ప్రత్యేకంగా మరో ఇళ్లునే కొనుగోలు చేస్తున్న పరిస్థితులు దర్శనం ఇస్తున్నాయి. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లలో ఉంటున్నారు.

అయితే తెలంగాణలో ఓ గిరిజన గూడేం మాత్రం వింత ఆలోచన చేసింది. గ్రామంలో కరోనా సోకిన వారు మూకుమ్మడిగా గ్రామంలోని స్మశానాన్నిఐసోలేషన్ సెంటర్ గా మార్చుకున్నారు. అక్కడే సాముహికంగా వంటలు వండుకుంటూ ఇతర గ్రామస్తుల సహాకారంతో బతుకు వెళ్లదీస్తున్నారు. అయితే స్మశానంలో ఎందుకని ప్రభుత్వ అధికారులు అడిగినా వారు మాత్రం స్మశానమే తమకు బెటర్ ఐసోలేషన్ సెంటర్ అని అక్కడి నుండి ప్రభత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ కి పోవడానికి ఇష్టపడలేదు.

వివరాల్లోకి వెళితే…ఖమ్మం జిల్లా అశ్వరావు పేట మండలంలోని మొద్దులమడ అనే గిరిజన గ్రామం ఉంది. ఆ గ్రామంలో మొత్తం 150 మంది జనాభా ఉన్నారు. విశేషం ఎమిటంటే మొత్తం గ్రామ జనాభాలో 50 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దాదాపుగా ఇంటికి ఒకరు కరోనా భారిన పడ్డారు. దీనితో ఇతరులకు వ్యాధి సోకకుండా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతమందికి ఒకేసారి కరోనా రావడంతో ఎవరింట్లో ఉండే పరిస్థితి లేదు. దీనికితోడు వేల ఖర్చులు పెట్టుకుని ఇతర ప్రాంతాలకు ఐసోలేషన్ సెంటర్ కు వెళ్లే అవకాశాలు లేకపోవడతో తమ గ్రామంలోనే ఉన్న విశాలమైన స్మశానవాటికను ఐసోలేషన్ సెంటర్ గా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గత రెండు రోజులుగా అక్కడే ఉంటూ సాముహిక బోజనాలు చేసుకుని తింటున్నారు. కాగా వీరికి తమ కుటుంబసభ్యులతో పాటు గ్రామపెద్దలు రాజకీయ నాయకులు సహాయం చేస్తున్నారు. ఎవరికి తోచిన సహాయం వారు చేస్తుండడంతో విషయం జిల్లా కలెక్టర్కు చేరింది. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ వారిని ఐసోలేషన్ సెంటర్కు తరలించి వైద్యం అందించాలని ఆదేశించారు. అయితే గిరిజనం మాత్రం అందుకు అంగీకరించలేదు.తమకు స్మశానంలోనే బాగుందని బదులు చెప్పారు. అక్కడే హాయిగా ఉంటున్నామని తెలిపారు.